1/19/09

అరిసెలు



కావలసిన పదార్ధాలు :

బియ్యం : అర కిలో
బెల్లం : పావు కిలో
నూనె : అరిసెలు వేయించుకోటానికి
నువ్వులు: యాభై గ్రాములు

తయారు చేసే విధానము:
అరిసెలు చెయ్యడానికి ఒక రోజు ముందు రాత్రి బియ్యం నాన బెట్టుకోవాలి. మరుసటి రోజు అరిసెలు చేసుకొనే ముందు బియ్యం లో నీరు అంతా తీసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

నీరు అంతా పోయేవరకు ఉంచాలి , కాని బియ్యం మాత్రం కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకొని తరువాత జల్లించు కోవాలి.

జల్లించిన పిండి ఆరిపోకుండా పిండి అంతా ఒక దెగ్గరకు తీసి నొక్కుతూ ఉండాలి.


ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అది మునిగే వరకు నీరు పోసి గాస్ మీద పెట్టాలి. ఒక ప్లేట్ లో నీరు పోసుకొని పక్కన పెట్టుకుంటే పాకం వచ్చిందో లేదో అందులో వేసి చూసుకోవచ్చు.

బెల్లం పాకం దెగ్గర పడుతుంటే కొంచెం పాకం తీసి మనం పెట్టు కున్న ప్లేట్ లో వేసి చూసుకోవాలి అది ఉండ చేసే లాగా దగ్గరకి వస్తుంటే గాస్ కట్టెయ్యవచ్చు. అరిసెలు గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. అంటే పళ్ళెం లో పాకం వేస్తే ఉండ అయ్యి ప్లేట్ కేసి కొడితే టంగు మని చప్పుడు రావాలి.
ఇప్పుడు పాకం లో ఇందాకా మనం ఆడి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం గా వేస్తూ బాగా కలుపుకోవాలి. అది కొంచెం జారుగా వచ్చేదాకా పిండి కలుపుకోవాలి.


ఇప్పుడ గాస్ మీద ఒక బాణీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. ఒక ప్లాస్టిక్ పేపర్ కాని అరటి ఆకు కానీ తీసుకొని , దానికి కొంచెం నూనె రాసి , కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా చేత్తో మనకు కావలసిన అంత సైజులో అరిసేను వత్తుకోవాలి.

కావాలనుకున్న వాళ్లు ఒక ప్లేట్ లో తెల్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు వత్తు కున్న అరిసేను ఆ నువ్వులలో దోర్లిన్చుకోవచ్చు. లేక పోతే పాకం లో పిండి కలిపే ముందే అందులో నువ్వులు కలిపేసుకోవచ్చు.

ఇప్పుడు వాటిని నూనెలో వేయించు కోవాలి. తరువాత వాటికి ఉన్న నూనెను అంతా తీసేయ్యటానికి ఒక పరికరం ఉంటుంది.

దాంట్లో పెట్టి నొక్కితే ఎక్కువ ఉన్న నూనె అంతా పోతుంది.

ఆ పరికరం లేక పోయినా రెండు గరిటెల మద్యలో పెట్టి అయిన గట్టిగా నొక్కుకోవచ్చు. అంతే ఎంతో నోరూరించే అరిసెలు రెడీ

పండు మిరపకాయ పచ్చడి



కావలసిన పదార్ధాలు :


పండు మిరపకాయలు : అర కిలో
మెంతులు : ఒక టేబుల్ స్పూను
చింతపండు : ఒక నిమ్మకాయ అంత
ఉప్పు : రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : అర స్పూను

తయారు చేసే విధానం :
ముందుగా మిరపకాయల ముచికెలు తీసి శుభ్రం చేసుకొని తడి పోయేవరకు ఎండలో పెట్టుకోవాలి.


తరువాత మిరపకాయలను మిక్సీలో వేసి చెక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి చింతపండు కలుపుకోవాలి ( చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి ) .

ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి. తరువాత మళ్లీ మిక్సీలో వేసి ఈసారి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెంతులు తీసుకొని ఒక బాణిలో వేసి బాగా వేయించుకోవాలి. వాటిని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా.
ఇప్పుడు ఆ మెంతి పొడిని, బెల్లాన్ని మరియు సరిపడా ఉప్పుని మిరపకాయల పేస్టు లో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వద్దనుకున్నవాళ్ళు వేసుకోవడం మనేయ్య వచ్చు. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని పొయ్య మీద పెట్టి నూనె పోసుకోవాలి. బాగా కాగాక అందులో ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గాస్ ఆపు చేసి నూనె బాగా చల్లారాక పచ్చడిలో పోసి కలుపుకోవాలి.

పండు మిరపకాయ పచ్చడి రెడీ......పచ్చడి చూడటానికి అంత ఎర్రగా ఉన్నా రుచి మాత్రం చాల కమ్మగా ఉంటుంది సుమా.....

పరోటా


కావలసిన పదార్ధాలు :
మైదా - అర కిలో
ఉప్పు - రుచికి తగినంత
పంచదార - అర స్పూను
నెయ్యి లేదా నూనె( పిండి కలుపుకోడానికి) - ఆరు ఏడు స్పూన్లు
నూనె లేదా నెయ్యి - పరోటా కాల్చుకోడానికి

తయారు చేసే విధానము :
ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలో ఉప్పు మరియు పంచదార కలుపుకోవాలి. రెండు మూడు స్పూన్ల నెయ్యి లేదా నూనె వెయ్యాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.తరువాత కూడా నాలుగు ఐదు స్పూన్ల నూనె వేసి , ఒక గంట పాటు ఒక తడి గుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మళ్లీ బాగా కలుపుకోవాలి .

ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండ తీసుకొని దానిని సన్నగా పొడుగ్గా తాడులాగా చేసుకోవాలి. తరువాత దాన్ని గుండ్రంగా చుట్టుకోవాలి.

లేదా ఒక ఉండను తీసుకొని దానిని గుండ్రంగా వత్తుకోవాలి. ఇప్పుడు దానిని చీర కుచ్చుళ్ళు పెట్టినట్టు పెట్టుకోవాలి. అలా పెట్టిన వాటిని మళ్లీ గుండ్రంగా చుట్టాలి.

ఇప్పుడు పిండి వెయ్యకుండా రొట్టెల పీట మీద నూనె వేసి కొంచెం మందంగా పరోటాని వత్తుకోవాలి.

అలా మిగిలిన ఉండలు కుడా వత్తుకోవాలి. తరువాత పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకోవాలి.

అంతే పరోటాలు రెడీ ......వాటిని మీకు ఇష్టం అయిన కూరతో లాగించేయ్యటమే......


1/6/09

జీరా రైస్ -- దాల్ ఫ్రై



కావలసిన పదార్ధాలు:

జీరా రైస్ :
అన్నము - అర కిలో
జీలకర్ర - మూడు టీ స్పూన్లు
పచ్చి మిర్చి - మూడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - ఐదు ఆరు టీ స్పూన్లు
జీడి పప్పు మరియు బఠాణీ - రుచికి కావాలనుకుంటే వేసుకోవచ్చు


దాల్ ఫ్రై :
పెసరపప్పు - వంద గ్రాములు
పచ్చిమిర్చి - రెండు
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి - రెండు
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను
ధనియాల పొడి - ఒక టీ స్పూను
కరివేపాకు - ఒక రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
పోపు సామాను



తయారు చేసే విధానము :

జీర రైస్ :
ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి. ఒక బాణీ తీసుకొని అందులో ఐదు లేక ఆరు టీ స్పూన్ల నూనె గానినెయ్యి గాని వేసి కాగ నివ్వాలి. అందులో మూడు టీ స్పూన్ల జీలకర్ర వేసి వేగ నివ్వాలి.
తరువాత తరిగిన పచ్చి మిర్చి వేసి వేగ నివ్వాలి.

రుచికి కావాలి అనుకుంటే జీడి పప్పు మరియు ఉడికించిన బఠాణీ వేసుకోవచ్చు .

వాటిని కూడా వేగనిచ్చి , ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి.

అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉండనిచ్చిదిన్చేసుకోడమే. చూసారా జీర రైస్ చెయ్యడం చాల సులువు కదా.....

దాల్ ఫ్రై :

ముందుగా పెసర పప్పు ని ఉడికించుకోవాలి. తరువాత ఒక బాణీ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగ నివ్వాలి. అందులో అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి వేగ నివ్వాలి. తరువాత పచ్చిమిర్చి మరియు కరివేపాకు కుడా వేసి వేగ నివ్వాలి.

ఇప్పుడు వుడికించుకొని పెట్టుకున్న పెసర పప్పుని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం పసుపు , జీలకర్ర పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి ఉడక నివ్వాలి. పప్పు మరీ గట్టిగా ఉన్నట్టు ఉంటే కాసిని నీళ్లు పోసుకోవచ్చు.

రెండు నిమిషాలు ఉడకనిచ్చి దిన్చేసుకోవచ్చు. రుచికి కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అల్లంవెల్లుల్లి తినని వాళ్లు అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. దాల్ ఫ్రై రెడీ ........