4/17/09

బొబ్బట్లు


కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.


ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.

పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.

రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .

ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.

ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.


ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.

అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.

మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......



1 comment: