10/14/09

కాజాలు లేదా చెక్కర బాణాలు


మా ఇంట్లో వీటిని కాజాలని అంటాము. మా అత్తారింట్లో వీటిని చెక్కర బాణాలని అంటారు. కాబట్టి రెండు రాసాను. ఇవి కాకినాడ కాజా మరియు మడత కాజా లాగా కాకుండా చాల సులువుగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు :
మైదా పిండి : అర కిలో
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార: అర కిలో

తయారు చేసే విధానం:
వీటిని పాకం పట్టుకోవచ్చు లేదా ఉప్పు కారం వేసి కమ్మగా చేసుకోవచ్చు. స్వీటు హాటు కూడా చేసుకోవచ్చన్నమాట. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కమ్మటి వాటికైతే ఉప్పు కలపాలి, తీపి వాటికి అక్కరలేదు. మైదా పిండిలో కొంచెం ( నాలుగు అయిదు స్పూన్లు) కాచిన నూనె కలుపుకోవాలి. అప్పుడు కాజాలు గుల్లగా వస్తాయి. తరువాత తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.

ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో .

ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వత్తి , కోసి వేయించుకోవాలి. కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులో వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి , పాకం అన్ని కాజాలకి పట్టేలాగా . చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.

2 comments:

  1. mee rachanalu bavunnayai
    bhadri
    www.appage.blogspot.com

    ReplyDelete
  2. mee kaajaalu chaala bagunnayi....ilaa chestea memu vitini maidaa biscuits ani antamu...actual gaa kaajaalu antea varugaa chestamu...okkoo prantam lo okkolaagaa antaremo..meeru chesinadi chudaaniki chaala bagunnayi.very nice

    ReplyDelete