2/17/09

వంకాయ పచ్చడి





కావలసిన పదార్ధాలు:
వంకాయలు : రెండు
ఆవాలు: ఒక స్పూను
మెంతులు: అర స్పూను
మినపప్పు : ఒక స్పూను
పచ్చిమిర్చి : మూడు
ఎండుమిర్చి : రెండు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
చింతపండు: కొంచెం
పంచదార: ఒక స్పూను
ఉల్లిపాయలు: ఒకటి ( పెద్దది ) ( ఆప్షనల్ )

తయారు చేసే విధానం :
ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాసు మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యేవరకు.

తరువాత దాన్ని చల్లార్చి పైన పొట్టు అంతా తీసెయ్యాలి. నీళ్ళలో చెయ్యితడుపుకుంటూ పొట్టు తీస్తే బాగా వస్తుంది. తరువాత పొట్టు తీసిన వంకాయని చిదిమేయ్యాలి.

ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. గ్యాసు మీద బాణీ పెట్టి అందులో ఒకస్పూను నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించి , గ్యాసు మీద నుండి దించేసి, చల్లార నివ్వాలి.
ఇప్పుడు గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారాక మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పంచదార వేసి గ్రైండ్ చెయ్యాలి. చివరిలో చిదిమిన వంకాయ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో వేయించిన ఉల్లిపాయలుకలుపుకోవాలి. వంకాయ పచ్చడి రెడీ....ఈ పచ్చడి తాజా తెల్ల వంకాయలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ...

దబ్బకాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:
దబ్బకాయ: ఒకటి
ఆవాలు: రెండు స్పూన్లు
మెంతులు : రెండు స్పూన్లు
ఎండుమిర్చి: ఇరవై
బెల్లం : యాభై గ్రాములు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానము:
ముందుగా దబ్బకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.

తరువాత గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఈ దబ్బకాయ ముక్కలను వేసి అవి మునిగేలాగా నీళ్ళుపొయ్యాలి. ముక్కలు మెత్త పడి దెగ్గర పడే వరకు ఉంచాలి. దెగ్గర పడ్డాక అందులో తరిగిన బెల్లంవెయ్యాలి. రెండు కలిసి దెగ్గర పడ్డాకా దింపెయ్యాలి. ఈ ముక్కలను చల్లారనివ్వాలి.
ఒక బాణిలో ఒక స్పూను నూనె పోసి అందులో ఆవాలు, మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి ఒకదాని తరువాత ఒకటి వేయించుకోవాలి. ఇంగువ కూడా వెయ్యాలి.

తరువాత వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.


ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలలో ఈ పొడిని( ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ) కలిపి ఉప్పు కూడా కలుపుకోవాలి.
దబ్బకాయ పచ్చడి తయారు....

టమాటా పచ్చడి

కావలసిన పదార్ధాలు:

టమాటాలు : అర కిలో
చింతపండు: యాభై గ్రాములు ( ఒక దబ్బకాయి అంత )
ఆవాలు : రెండు స్పూన్లు
మెంతులు: రెండు స్పూన్లు
ఎండుకారం: రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
ఉప్పు : రుచికి తగినంత
ఇంగువ : ఒక స్పూను
నూనె : రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.

తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ముక్కలకి చింతపండు కలుపుకోవాలి. చింత పండులో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా చింతపండు కలిపిన ముక్కలను ఒక గంట పాటు పక్కకు పెట్టుకొని ఊరనివ్వాలి.

ఈలోపు గ్యాసు మీదా ఒక బాణీ పెట్టి అందులో అర స్పూను నూనె వేసి అందులో ఆవాలు మరియు మెంతులు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. వాటిని చల్లారనిచ్చి రెండూ కలిపి మిక్సీ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

గ్యాసు మీద మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో రెండూ టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కాగనివ్వాలి. అందులో ఇంగువ వేసి దిన్చేసుకోవాలి. ఇంగువ నూనెను బాగా చల్లార నివ్వాలి.

గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఊరిన టమాటా ముక్కలను వేసి బాగా దెగ్గర పడే దాక కలుపుతూ ఉండాలి. తరువాత దించేసి మిశ్రమాన్ని బాగా చల్లార నివ్వాలి.

చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ లో వేసి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్టుకి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కలపాలి. ఇంకా ఎండుకారం, ఉప్పు మరియు ఇంగువ నూనె కూడా కలుపుకోవాలి.
అంతే టమాటా పచ్చడి రెడీ......


పుట్నాల పొడి ( గుల్ల సెనగపప్పు పొడి )



కావలసిన పదార్ధాలు
:

పుట్నాలు లేదా గుల్ల సెనగ పప్పు : అర కిలో
ఎండుమిర్చి : పది
జీలకర్ర : ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానము:
ఈ పొడి తయారు చేసుకోవడం చాలా సులువు.

మిక్సీ లో పుట్నాలు, ఎండుమిర్చి, జీలకర్ర మరియు ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే ..దీనిని జల్లించు కోవలసిన అవసరం కూడా ఉండదు.....గ్రైండ్ చేసిన వెంటనే మెత్తటి పొడి వచ్చేస్తుంది..పుట్నాల పొడి రెడీ అయినట్టే.....

కంది పొడి



కావలసిన పదార్ధాలు:

కంది పప్పు : పావు కిలో
పెసర పప్పు : అర్ధ పావు
సెనగ పప్పు : అర్ధ పావు
జీలకర్ర : రెండు స్పూన్లు
ఎండు మిర్చి : ఇరవై అయిదు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసే విధానం :

ముందుగా గ్యాసు వెలిగించు కొని ఒక బాణీ పెట్టి అందులో కంది పప్పు, పెసర పప్పు మరియు సెనగ పప్పు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. అన్ని పప్పులు కలిపి ఒక పళ్ళెములో పోసి చల్లార నివ్వాలి.

ఇప్పుడు మళ్ళీ గ్యాసు మీద బాణీ పెట్టి, నూనె లేకుండానే జీలకర్ర మరియు ఎండుమిర్చి ని కూడా వేయించుకోవాలి.


అలా వేయించుకున్న పప్పులు మరియు జీలకర్ర, ఎండుమిర్చిలను మిక్సీలో వేసి అందులో ఉప్పు కూడా కలిపి ( సుమారు మూడు స్పూన్లు ) మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దానిని జల్లెడతో జల్లించుకోవాలి . జల్లెడలో మిగిలిన దానిని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తటి పొడి వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి. అంతే కంది పొడి తయారు అయినట్టే .....అలా తయారైన పొడిని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పోసుకొని నిలువ చేసుకోవాలి......