Showing posts with label Pindi Vantalu. Show all posts
Showing posts with label Pindi Vantalu. Show all posts

10/14/09

వేరుసెనగపప్పు చిక్కి


కావలసిన పదార్ధాలు:

వేరుసెనగపప్పు లేదా పల్లీలు - అర కిలో
బెల్లం - అర కిలో ( తరుగుకోవాలి )
గుల్ల సెనగపప్పు లేదా పుట్నాలు - రెండు మూడు స్పూన్లు
నీరు

తయారు చేసే విధానం:
ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టి వేరుసెనగపప్పుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణీ కానీ మందంగా ఉన్న గిన్నె గాని తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసి బెల్లం మునిగేదాక నీరు పోసి గ్యాస్ మీద పెట్టి ముదురు పాకం పట్టుకోవాలి.

ఒక ప్లేట్ లో కొంచెం నీరు పోసి బెల్లం పాకం అవుతుండగా కొంచెం తీసి నీళ్ళలో వేసి అది ఉండ అవుతుంటే ముదురు పాకం వచ్చినట్టే. పాకం వచ్చాక అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు , పుట్నాలు వేసి బాగా కలపాలి.


ఇప్పుడు ఒక కంచం కాని ప్లేట్ గాని తీసుకొని గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి పోసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి డబ్బాలో పెట్టుకోవాలి.

4/17/09

బొబ్బట్లు


కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.


ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.

పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.

రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .

ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.

ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.


ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.

అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.

మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......



1/19/09

అరిసెలు



కావలసిన పదార్ధాలు :

బియ్యం : అర కిలో
బెల్లం : పావు కిలో
నూనె : అరిసెలు వేయించుకోటానికి
నువ్వులు: యాభై గ్రాములు

తయారు చేసే విధానము:
అరిసెలు చెయ్యడానికి ఒక రోజు ముందు రాత్రి బియ్యం నాన బెట్టుకోవాలి. మరుసటి రోజు అరిసెలు చేసుకొనే ముందు బియ్యం లో నీరు అంతా తీసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.

నీరు అంతా పోయేవరకు ఉంచాలి , కాని బియ్యం మాత్రం కొంచెం తడిగానే ఉండాలి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకొని తరువాత జల్లించు కోవాలి.

జల్లించిన పిండి ఆరిపోకుండా పిండి అంతా ఒక దెగ్గరకు తీసి నొక్కుతూ ఉండాలి.


ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అది మునిగే వరకు నీరు పోసి గాస్ మీద పెట్టాలి. ఒక ప్లేట్ లో నీరు పోసుకొని పక్కన పెట్టుకుంటే పాకం వచ్చిందో లేదో అందులో వేసి చూసుకోవచ్చు.

బెల్లం పాకం దెగ్గర పడుతుంటే కొంచెం పాకం తీసి మనం పెట్టు కున్న ప్లేట్ లో వేసి చూసుకోవాలి అది ఉండ చేసే లాగా దగ్గరకి వస్తుంటే గాస్ కట్టెయ్యవచ్చు. అరిసెలు గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి. అంటే పళ్ళెం లో పాకం వేస్తే ఉండ అయ్యి ప్లేట్ కేసి కొడితే టంగు మని చప్పుడు రావాలి.
ఇప్పుడు పాకం లో ఇందాకా మనం ఆడి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం గా వేస్తూ బాగా కలుపుకోవాలి. అది కొంచెం జారుగా వచ్చేదాకా పిండి కలుపుకోవాలి.


ఇప్పుడ గాస్ మీద ఒక బాణీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. ఒక ప్లాస్టిక్ పేపర్ కాని అరటి ఆకు కానీ తీసుకొని , దానికి కొంచెం నూనె రాసి , కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా చేత్తో మనకు కావలసిన అంత సైజులో అరిసేను వత్తుకోవాలి.

కావాలనుకున్న వాళ్లు ఒక ప్లేట్ లో తెల్ల నువ్వులు వేసుకొని ఇప్పుడు వత్తు కున్న అరిసేను ఆ నువ్వులలో దోర్లిన్చుకోవచ్చు. లేక పోతే పాకం లో పిండి కలిపే ముందే అందులో నువ్వులు కలిపేసుకోవచ్చు.

ఇప్పుడు వాటిని నూనెలో వేయించు కోవాలి. తరువాత వాటికి ఉన్న నూనెను అంతా తీసేయ్యటానికి ఒక పరికరం ఉంటుంది.

దాంట్లో పెట్టి నొక్కితే ఎక్కువ ఉన్న నూనె అంతా పోతుంది.

ఆ పరికరం లేక పోయినా రెండు గరిటెల మద్యలో పెట్టి అయిన గట్టిగా నొక్కుకోవచ్చు. అంతే ఎంతో నోరూరించే అరిసెలు రెడీ

12/10/08

గవ్వలు

కావలసిన పధార్ధాలు :
మైదా -- అర కేజీ
బొంబాయి రవ్వ - రెండు లేదా మూడు స్పూన్స్ ( కరకరలాడటం కోసం )
మంచి నూనె - వేయించటానికి సరిపోయే అంత ( సుమారు అర కిలో )
గవ్వల పీట


పాకం కొరకు :
పంచదార - అర కేజీ
నీరు -- పంచదార మునిగే అన్ని

తయారు చేయు విధానం :

ముందుగా మైదా పిండిని , బొంబాయి రవ్వని తీసుకొని సరిపడా నీరు పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒక నాలుగు ఐదు స్పూన్స్ నూనెను కాచి పిండి కలిపేటప్పుడు పోస్తే గవ్వలు గుల్లగా వస్తాయి.

పైన ఫోటోలో పిండి పక్కన ఉన్నదే గవ్వల పీట. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ( గోలీకాయ అంత ) గవ్వల పీట మీద పెట్టి బొటను వేలితో పీట మీద వోత్తుకోవాలి.


అవి రెడీ అయ్యాక ఇలా ఉంటాయి.



ఇప్పుడు వీటిని నూనెలో దోరగ వేయించు కోవాలి.


ఒక పాత్రలో పంచదార వేసి అది మునిగే వరకు నీరు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సువాసన కోసం యాలకుల పొడి కూడా పాకంలో వేసుకొవచ్చు. ముదురు పాకం పట్టుకోవాలి. తరువాత వేగిన గవ్వలు పాకంలో వేసి బాగా కలుపుకోవాలి.
ఎంతో రుచికరమైన కరకరలాడే గవ్వలు తయారు.......





కొట్టగా పాకం పట్టటం నేర్చుకొనే వారికీ పాకం పట్టటం కూడా చెప్పనా మరి.....

పంచదారలో నీరు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఒక ప్లేట్ లో కాసిని నీరు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం దెగ్గర పడుతోంది అని అనిపించి నప్పుడు కొంచెం పాకం తీసి నీళ్లు ఉన్న ప్లేట్ లో వేసి అది ఉండ చెయ్యడం ఐతే ముదురు పాకం వచ్చినట్టే....చాల సులువు కదూ....