Showing posts with label Pacchallu. Show all posts
Showing posts with label Pacchallu. Show all posts

10/14/09

దోస ఆవకాయ


కావలసిన పదార్ధాలు :
దోసకాయలు : అర కిలో
ఆవపిండి : ముప్పై గ్రాములు సుమారు
ఉప్పు : నలభై గ్రాములు సుమారు
కారం : యాభై గ్రాములు సుమారు
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం:

ముందుగా దోసకాయను తీసుకొని సగానికి తరిగి అందులో గింజలు తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

దోసకాయ చెక్కు తియ్యకూడదు . ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో దోసకాయ ముక్కలు , ఆవపిండి, కారం, ఉప్పు మరియు నూనె వేసి బాగా కలుపుకోవాలి.

ఉప్పు రుచిని బట్టి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలా అన్నీ బాగా కలిపిన తరువాత మూత పెట్టి ఊరనివ్వాలి. ఒక రోజు ఊరితే కారం , ఉప్పు మరియు ఆవపిండి ముక్కలకి బాగా పడుతుంది. మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నూనె కలుపుకోవచ్చు. అలా ఊరిన దోస ఆవకాయిని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవాలి. ఇది మూడు నాలుగు వారాలదాకా నిలువ ఉంటుంది.

2/17/09

వంకాయ పచ్చడి





కావలసిన పదార్ధాలు:
వంకాయలు : రెండు
ఆవాలు: ఒక స్పూను
మెంతులు: అర స్పూను
మినపప్పు : ఒక స్పూను
పచ్చిమిర్చి : మూడు
ఎండుమిర్చి : రెండు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
చింతపండు: కొంచెం
పంచదార: ఒక స్పూను
ఉల్లిపాయలు: ఒకటి ( పెద్దది ) ( ఆప్షనల్ )

తయారు చేసే విధానం :
ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాసు మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యేవరకు.

తరువాత దాన్ని చల్లార్చి పైన పొట్టు అంతా తీసెయ్యాలి. నీళ్ళలో చెయ్యితడుపుకుంటూ పొట్టు తీస్తే బాగా వస్తుంది. తరువాత పొట్టు తీసిన వంకాయని చిదిమేయ్యాలి.

ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. గ్యాసు మీద బాణీ పెట్టి అందులో ఒకస్పూను నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించి , గ్యాసు మీద నుండి దించేసి, చల్లార నివ్వాలి.
ఇప్పుడు గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారాక మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పంచదార వేసి గ్రైండ్ చెయ్యాలి. చివరిలో చిదిమిన వంకాయ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో వేయించిన ఉల్లిపాయలుకలుపుకోవాలి. వంకాయ పచ్చడి రెడీ....ఈ పచ్చడి తాజా తెల్ల వంకాయలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ...

దబ్బకాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:
దబ్బకాయ: ఒకటి
ఆవాలు: రెండు స్పూన్లు
మెంతులు : రెండు స్పూన్లు
ఎండుమిర్చి: ఇరవై
బెల్లం : యాభై గ్రాములు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానము:
ముందుగా దబ్బకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.

తరువాత గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఈ దబ్బకాయ ముక్కలను వేసి అవి మునిగేలాగా నీళ్ళుపొయ్యాలి. ముక్కలు మెత్త పడి దెగ్గర పడే వరకు ఉంచాలి. దెగ్గర పడ్డాక అందులో తరిగిన బెల్లంవెయ్యాలి. రెండు కలిసి దెగ్గర పడ్డాకా దింపెయ్యాలి. ఈ ముక్కలను చల్లారనివ్వాలి.
ఒక బాణిలో ఒక స్పూను నూనె పోసి అందులో ఆవాలు, మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి ఒకదాని తరువాత ఒకటి వేయించుకోవాలి. ఇంగువ కూడా వెయ్యాలి.

తరువాత వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.


ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలలో ఈ పొడిని( ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ) కలిపి ఉప్పు కూడా కలుపుకోవాలి.
దబ్బకాయ పచ్చడి తయారు....

టమాటా పచ్చడి

కావలసిన పదార్ధాలు:

టమాటాలు : అర కిలో
చింతపండు: యాభై గ్రాములు ( ఒక దబ్బకాయి అంత )
ఆవాలు : రెండు స్పూన్లు
మెంతులు: రెండు స్పూన్లు
ఎండుకారం: రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
ఉప్పు : రుచికి తగినంత
ఇంగువ : ఒక స్పూను
నూనె : రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.

తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ముక్కలకి చింతపండు కలుపుకోవాలి. చింత పండులో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా చింతపండు కలిపిన ముక్కలను ఒక గంట పాటు పక్కకు పెట్టుకొని ఊరనివ్వాలి.

ఈలోపు గ్యాసు మీదా ఒక బాణీ పెట్టి అందులో అర స్పూను నూనె వేసి అందులో ఆవాలు మరియు మెంతులు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. వాటిని చల్లారనిచ్చి రెండూ కలిపి మిక్సీ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

గ్యాసు మీద మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో రెండూ టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కాగనివ్వాలి. అందులో ఇంగువ వేసి దిన్చేసుకోవాలి. ఇంగువ నూనెను బాగా చల్లార నివ్వాలి.

గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఊరిన టమాటా ముక్కలను వేసి బాగా దెగ్గర పడే దాక కలుపుతూ ఉండాలి. తరువాత దించేసి మిశ్రమాన్ని బాగా చల్లార నివ్వాలి.

చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ లో వేసి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్టుకి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కలపాలి. ఇంకా ఎండుకారం, ఉప్పు మరియు ఇంగువ నూనె కూడా కలుపుకోవాలి.
అంతే టమాటా పచ్చడి రెడీ......


1/19/09

పండు మిరపకాయ పచ్చడి



కావలసిన పదార్ధాలు :


పండు మిరపకాయలు : అర కిలో
మెంతులు : ఒక టేబుల్ స్పూను
చింతపండు : ఒక నిమ్మకాయ అంత
ఉప్పు : రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
బెల్లం : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ : అర స్పూను

తయారు చేసే విధానం :
ముందుగా మిరపకాయల ముచికెలు తీసి శుభ్రం చేసుకొని తడి పోయేవరకు ఎండలో పెట్టుకోవాలి.


తరువాత మిరపకాయలను మిక్సీలో వేసి చెక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. తరువాత దానికి చింతపండు కలుపుకోవాలి ( చింతపండులో గింజలు లేకుండా చూసుకోవాలి ) .

ఈ మిశ్రమాన్ని రెండు రోజులు మూతపెట్టి ఊరనివ్వాలి. తరువాత మళ్లీ మిక్సీలో వేసి ఈసారి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెంతులు తీసుకొని ఒక బాణిలో వేసి బాగా వేయించుకోవాలి. వాటిని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా.
ఇప్పుడు ఆ మెంతి పొడిని, బెల్లాన్ని మరియు సరిపడా ఉప్పుని మిరపకాయల పేస్టు లో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం వద్దనుకున్నవాళ్ళు వేసుకోవడం మనేయ్య వచ్చు. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని పొయ్య మీద పెట్టి నూనె పోసుకోవాలి. బాగా కాగాక అందులో ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు గాస్ ఆపు చేసి నూనె బాగా చల్లారాక పచ్చడిలో పోసి కలుపుకోవాలి.

పండు మిరపకాయ పచ్చడి రెడీ......పచ్చడి చూడటానికి అంత ఎర్రగా ఉన్నా రుచి మాత్రం చాల కమ్మగా ఉంటుంది సుమా.....