Showing posts with label Rice Items. Show all posts
Showing posts with label Rice Items. Show all posts

10/14/09

వెజిటబుల్ పులావ్


కావలసిన పదార్ధాలు:
బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బంగాళా దుంపలు లేదా ఆలూ: నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
లవంగాలు: అయిదు ఆరు
యాలకులు : అయిదు ఆరు
దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
పసుపు: చిటికెడు ( రంగు కోసం )
ఉప్పు : రుచికి తగినంత
నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు)
బిర్యాని ఆకు : రెండు మూడు

తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.

ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.

ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.

అవి కొంచెం వేగ నివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.
పులావ్ తో పాటు ఉల్లిపాయ రైతా చేసుకుంటే బాగుంటుంది.

1/6/09

జీరా రైస్ -- దాల్ ఫ్రై



కావలసిన పదార్ధాలు:

జీరా రైస్ :
అన్నము - అర కిలో
జీలకర్ర - మూడు టీ స్పూన్లు
పచ్చి మిర్చి - మూడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి - ఐదు ఆరు టీ స్పూన్లు
జీడి పప్పు మరియు బఠాణీ - రుచికి కావాలనుకుంటే వేసుకోవచ్చు


దాల్ ఫ్రై :
పెసరపప్పు - వంద గ్రాములు
పచ్చిమిర్చి - రెండు
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి - రెండు
జీలకర్ర పొడి - ఒక టీ స్పూను
ధనియాల పొడి - ఒక టీ స్పూను
కరివేపాకు - ఒక రెబ్బ
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
పోపు సామాను



తయారు చేసే విధానము :

జీర రైస్ :
ముందుగా అన్నం వండుకొని చల్లార బెట్టాలి. ఒక బాణీ తీసుకొని అందులో ఐదు లేక ఆరు టీ స్పూన్ల నూనె గానినెయ్యి గాని వేసి కాగ నివ్వాలి. అందులో మూడు టీ స్పూన్ల జీలకర్ర వేసి వేగ నివ్వాలి.
తరువాత తరిగిన పచ్చి మిర్చి వేసి వేగ నివ్వాలి.

రుచికి కావాలి అనుకుంటే జీడి పప్పు మరియు ఉడికించిన బఠాణీ వేసుకోవచ్చు .

వాటిని కూడా వేగనిచ్చి , ఇప్పుడు అన్నం అందులో వేసుకోవాలి.

అన్ని బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క నిమిషం గ్యాసు మీద ఉండనిచ్చిదిన్చేసుకోడమే. చూసారా జీర రైస్ చెయ్యడం చాల సులువు కదా.....

దాల్ ఫ్రై :

ముందుగా పెసర పప్పు ని ఉడికించుకోవాలి. తరువాత ఒక బాణీ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు మరియు జీలకర్ర వేసి వేగ నివ్వాలి. అందులో అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు వేసి వేగ నివ్వాలి. తరువాత పచ్చిమిర్చి మరియు కరివేపాకు కుడా వేసి వేగ నివ్వాలి.

ఇప్పుడు వుడికించుకొని పెట్టుకున్న పెసర పప్పుని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం పసుపు , జీలకర్ర పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి ఉడక నివ్వాలి. పప్పు మరీ గట్టిగా ఉన్నట్టు ఉంటే కాసిని నీళ్లు పోసుకోవచ్చు.

రెండు నిమిషాలు ఉడకనిచ్చి దిన్చేసుకోవచ్చు. రుచికి కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అల్లంవెల్లుల్లి తినని వాళ్లు అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. దాల్ ఫ్రై రెడీ ........