7/15/09

పనీర్ టిక్కా



కావలసిన పదార్ధాలు:


పనీర్ : రెండు వందల గ్రాములు
క్యాప్సికం : రెండు
ఉల్లిపాయలు : రెండు
టమాటాలు : రెండు
పెరుగు: యాభై గ్రాములు ( ఐదు లేక ఆరు స్పూన్లు )
ధనియాల పొడి : ఒక స్పూను
జీలకర్ర పొడి : ఒక స్పూను
కారం: అర స్పూను
తందూరీ మసాల: ఒక స్పూను
చాట్ మసాల: ఒక స్పూను
ఉప్పు: రుచికి తగినంత
కసూరి మేథి: అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక స్పూను

తయారు చేసే విధానము:

ముందుగా పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు( బాగా గట్టిగా ఉండి, నీరు లేకుండా చూసుకోవాలి) , అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి , జీలకర్ర పొడి, కారం, చాట్ మసాల, తందూరీ మసాల, కారం, ఉప్పు మరియు కసూరి మేథి వేసుకోవాలి. అన్ని బాగా కలుపుకోవాలి . ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న, పనీర్, క్యాప్సికం, ఉల్లిపాయలు మరియు టమాటాలను వేసుకొని, మసాల అంతా అన్ని ముక్కలకి పట్టేలగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్ ని రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

ఇప్పుడు ఫ్రిజ్ లోనుండి బౌల్ తీసి అన్ని ముక్కలను పెనం మీద కాని, ఓవెన్ లో కాని, లేక పోతే కుంపటి లో కాని దోరగా కాల్చుకోవాలి. లేదా నూనెలో వేసి వేయించుకోవాలి. నేను వాటిని కుంపటిలో కాల్చాను.


అలా చెయ్యాలి అంటే ఒక పుల్ల కాని సన్నని ఊచ లాంటిది కాని తీసుకొని ఒక పనీర్ ముక్క, ఒక క్యాప్సికం ముక్క, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక టమాటా ముక్క అలా ఒక దాని తరువాత ఒకటి ఊచకి గుచ్చి కుంపటి మీద పెట్టి కాల్చుకోవాలి.


ఎంతో రుచిగా ఉండే పనీర్ టిక్కా రెడీ అయినట్టే....అదీ హోటల్ లో చేసినట్టే....ట్రై చెయ్యండి మరి....

4/17/09

బొబ్బట్లు


కావలసిన పదార్ధాలు :
శనగ పప్పు : అర కిలో
బెల్లం: అర కిలో
మైదా : అర కిలో
యాలకులు : అయిదు లేక ఆరు
నెయ్యి : బొబ్బట్లు కాల్చుకోడానికి తగినంత
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం :
బొబ్బట్లు చెయ్యడానికి మూడు నాలుగు గంటల ముందే చోవికి మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలి.
మైదా పిండిలో నీరు పోసి మామూలుగా మనం పూరీలకి, చపాతిలకి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక అందులో వంద గ్రాములు పైగానే నూనె పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనెలో పిండి ఎంత నానితే అంత మెత్తగా బొబ్బట్లు వస్తాయి.


ఇప్పుడు ఒక గిన్నెలో శనగ పప్పు వేసి పప్పు మునిగే దాక నీరు పోసి గాస్ మీద పెట్టాలి. పప్పు మెత్త పడే దాకా ఉడికించాలి. ఉడికే లోపు నీరు అయిపోతే మళ్ళీ పోసుకోవచ్చు. పప్పు ఉడికాక మాత్రం గిన్నెలో నీరు ఉండకుండా చూసుకోవాలి. ఒక వేళ నీరు ఉండిపోతే అవి ఇగిరిపోయే వరకు పప్పుని గాస్ మీదే ఉంచి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు పప్పుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి . అర కిలో బెల్లం తీసుకొని తరుగుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక వంద గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని పప్పులో వేసి రెండు ఆర నివ్వాలి. యాలకుల పొడి అందులో కలుపుకోవాలి.

పప్పు చల్లారాక మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి.

రుబ్బిన పిండిని తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి .

ఇప్పుడు నానిన మైదా పిండిని తీసుకొని, చిన్న పూరి అంత వత్తుకొని ( చేత్తోనే ) ఇందాక మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు పూరి మద్యలో పెట్టాలి.

ఆ ఉండని మొత్తం చుట్టూరా ఉన్న పిండి తో మూసెయ్యాలి.


ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ కానీ అరటి ఆకు ఉన్న వాళ్ళు ఆకుని కానీ తీసుకొని, దానికి నూనె లేదా నేయ్యి రాసి ఇందాక చేసిన ఉండని దాని మీద పెట్టి చేత్తో చపాతీ లాగా వత్తుకోవాలి.

అలా వత్తుకున్న దాన్ని పెనం మీద వేసి, కాస్త నెయ్యి వేసి కాల్చుకోవాలి.

మిగిలిన పూర్ణం కూడా పైన చేసిన విధంగా చేసుకోవాలి.
బొబ్బట్లు రెడీ అయినట్టే మరి .......



రంగోలి రోటి



కావలసిన పదార్ధాలు :

మైదా : అర కిలో
పాలకూర : మూడు కట్టలు
టమాటాలు : నాలుగు పెద్దవి
పచ్చి మిర్చి : నాలుగు
జీలకర్ర పొడి : ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూను
కారం: అర టీ స్పూను
ఉప్పు : రుచికి తగినంత
నూనె : మూడు టబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా పాలకూర ఆకులు తీసుకొని బాగా కడుగుకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. పాలకూర ఉడికాక నీటిలో నుండి తీసేసి చల్లార నివ్వాలి. ఇప్పుడు మిక్సీ జారులో పాలకూర , పచ్చిమిర్చి , జీలకర్ర పొడి మరియు సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ పాలకూర్ ముద్దను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు టమాటాలను తీసుకొని మళ్ళీ వేడి నీటిలో వేసి పాలకూరని ఉదికిన్చినట్టే ఉడికించాలి. టమాటాలు ఉడికాక నీటి నుండి తీసి చల్లార బెట్టాలి. చల్లారాక టమాటాకి ఉన్న తొక్కని తీసెయ్యాలి. ఆ టమాటాలను మిక్సీ లో వేసి కొంచెం కారం , అల్లం వెల్లుల్లి ముద్ద మరియు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో సగం మైదా పిండి అంటే పావు కిలో తీసుకొని అందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ముద్దని వేసి అవసరం అనుకుంటే కొంచెం నీరు పోసి రెండు టీ స్పూన్ల నూనె వేసి చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. అలా తయారు అయిన పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన మైదా పిండిలో మనం తయారుగా పెట్టుకున్న టమాటా ముద్దను కలిపి కొంచెం నూనె కొంచెం నీరు పోసి మళ్ళీ ఇందాకటి లాగే చపాతీ పిండిలాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒకొక్క పిండి ముద్దను తీసుకొని విడివిడిగా పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి .

కొంచెం మందంగా వత్తుకోవాలి. ఆకుపచ్చ చపాతీ మీద ఎర్ర చపాతీ పెట్టి రెండు కలిపి ఆ ముక్కలను. తరువాత చాకుతో అడ్డంగా ముక్కలుగా కోసుకోవాలి.
నిలువుగా ఉన్నా ముక్కను అడ్డంగా తిప్పితే ఇలా ఉంటుంది.

ఒకొక్క ముక్కను తీసుకొని చపాతీ లాగ వత్తుకోవాలి.

అంతే రంగోలి రోటి రెడీ.....మీకు నచ్చిన కూరతో కలిపి లాగించేయ్యడమే మరి .....
నేను ఈ వంటకాన్ని ఈనాడు ఆదివారం పుస్తకంలో చూసి ట్రై చేశాను బాగా కుదిరాయి....మీరు కూడా ట్రై చెయ్యండి మరి.....

4/15/09

సేమ్యా ఉప్మా



కావలసిన పదార్ధాలు:

సేమ్యా : అర కిలో
బంగాళా దుంపలు ( ఆలు) : రెండు , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
ఉల్లిపాయలు : ఒకటి పెద్దది , చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి
పల్లీలు : గుప్పెడు
పచ్చిమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెబ్బ
పోపు సామాను: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు
నూనె: మూడు టబుల్ స్పూన్లు
నీరు : లీటరు
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసే విధానము :
ముందుగా గాస్ మీద ఒక బాణీ పెట్టి అది వేడి అయ్యాక అందులో ఒక టబుల్ స్పూన్ నూనె పోసి నూనె కాగాక అందులో సేమ్యా వేసి కొంచెం వేయించుకోవాలి ( పచ్చి వాసన రాకుండా కొంచెం వేయించాలి, అంతే ) . సేమ్యా బంగారు రంగు రాకుండానే దింపెయ్యాలి. అలా వేయించిన సేమ్యా ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మళ్ళీ గాస్ మీద బాణీ పెట్టుకొని బాణీ కాగాక అందులో రెండు టబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, పల్లీలు, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగ నివ్వాలి. ఇప్పుడు అందులో బంగాల దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక లీటరు నీరు పోసుకోవాలి. ఒక గ్లాసు సేమ్యకి రెండు గ్లాసుల నీళ్లు అన్నమాట. నీరు పోసాక బాణీ పై మూత పెట్టి నీరు మరగానివ్వాలి.

నీరు మరుగుతూ ఉండగా అందులో ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యా ని ఆ నీటిలో వేసి బాగా కలిపి గాస్ మంట తగ్గించి మళ్ళీ మూత పెట్టెయ్యాలి. మద్య మద్య లో మూత తీసి కదుపుతూ ఉండాలి. నీళ్లు అన్ని ఇగిరి సేమ్యా ఉడికాక ఇంక గాస్ కట్టేయ్యాలి.

వేడి వేడి సేమ్యా ఉప్మా రెడీ.....

2/17/09

వంకాయ పచ్చడి





కావలసిన పదార్ధాలు:
వంకాయలు : రెండు
ఆవాలు: ఒక స్పూను
మెంతులు: అర స్పూను
మినపప్పు : ఒక స్పూను
పచ్చిమిర్చి : మూడు
ఎండుమిర్చి : రెండు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత
చింతపండు: కొంచెం
పంచదార: ఒక స్పూను
ఉల్లిపాయలు: ఒకటి ( పెద్దది ) ( ఆప్షనల్ )

తయారు చేసే విధానం :
ముందుగా వంకాయకు కొద్దిగా నూనె రాసి గ్యాసు మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. పైన తొక్క అంతా నల్లగా అయ్యేవరకు.

తరువాత దాన్ని చల్లార్చి పైన పొట్టు అంతా తీసెయ్యాలి. నీళ్ళలో చెయ్యితడుపుకుంటూ పొట్టు తీస్తే బాగా వస్తుంది. తరువాత పొట్టు తీసిన వంకాయని చిదిమేయ్యాలి.

ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి. గ్యాసు మీద బాణీ పెట్టి అందులో ఒకస్పూను నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించి , గ్యాసు మీద నుండి దించేసి, చల్లార నివ్వాలి.
ఇప్పుడు గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఒక స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు, ఇంగువ, పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి వేసి పోపు వేయించుకోవాలి.

పోపు చల్లారాక మిక్సీలో వేసి కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పంచదార వేసి గ్రైండ్ చెయ్యాలి. చివరిలో చిదిమిన వంకాయ కూడా వేసి ఒక్కసారి గ్రైండ్ చెయ్యాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిలో వేయించిన ఉల్లిపాయలుకలుపుకోవాలి. వంకాయ పచ్చడి రెడీ....ఈ పచ్చడి తాజా తెల్ల వంకాయలతో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ...

దబ్బకాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు:
దబ్బకాయ: ఒకటి
ఆవాలు: రెండు స్పూన్లు
మెంతులు : రెండు స్పూన్లు
ఎండుమిర్చి: ఇరవై
బెల్లం : యాభై గ్రాములు
ఇంగువ: ఒక స్పూను
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేసే విధానము:
ముందుగా దబ్బకాయను చిన్న చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.

తరువాత గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఈ దబ్బకాయ ముక్కలను వేసి అవి మునిగేలాగా నీళ్ళుపొయ్యాలి. ముక్కలు మెత్త పడి దెగ్గర పడే వరకు ఉంచాలి. దెగ్గర పడ్డాక అందులో తరిగిన బెల్లంవెయ్యాలి. రెండు కలిసి దెగ్గర పడ్డాకా దింపెయ్యాలి. ఈ ముక్కలను చల్లారనివ్వాలి.
ఒక బాణిలో ఒక స్పూను నూనె పోసి అందులో ఆవాలు, మెంతులు మరియు ఎండుమిరపకాయలు వేసి ఒకదాని తరువాత ఒకటి వేయించుకోవాలి. ఇంగువ కూడా వెయ్యాలి.

తరువాత వీటన్నిటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.


ఇప్పుడు ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న ముక్కలలో ఈ పొడిని( ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ) కలిపి ఉప్పు కూడా కలుపుకోవాలి.
దబ్బకాయ పచ్చడి తయారు....

టమాటా పచ్చడి

కావలసిన పదార్ధాలు:

టమాటాలు : అర కిలో
చింతపండు: యాభై గ్రాములు ( ఒక దబ్బకాయి అంత )
ఆవాలు : రెండు స్పూన్లు
మెంతులు: రెండు స్పూన్లు
ఎండుకారం: రుచికి తగినంత ( సుమారు యాభై గ్రాములు )
ఉప్పు : రుచికి తగినంత
ఇంగువ : ఒక స్పూను
నూనె : రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే విధానము:

ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడిలేకుండా బాగా తుడుచుకోవాలి.

తరువాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ముక్కలకి చింతపండు కలుపుకోవాలి. చింత పండులో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా చింతపండు కలిపిన ముక్కలను ఒక గంట పాటు పక్కకు పెట్టుకొని ఊరనివ్వాలి.

ఈలోపు గ్యాసు మీదా ఒక బాణీ పెట్టి అందులో అర స్పూను నూనె వేసి అందులో ఆవాలు మరియు మెంతులు ఒకదాని తరువాత ఒకటి దోరగా వేయించుకోవాలి. వాటిని చల్లారనిచ్చి రెండూ కలిపి మిక్సీ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

గ్యాసు మీద మళ్ళీ బాణీ పెట్టుకొని అందులో రెండూ టేబుల్ స్పూన్ల నూనె పోసి బాగా కాగనివ్వాలి. అందులో ఇంగువ వేసి దిన్చేసుకోవాలి. ఇంగువ నూనెను బాగా చల్లార నివ్వాలి.

గ్యాసు మీద ఒక బాణీ పెట్టి అందులో ఊరిన టమాటా ముక్కలను వేసి బాగా దెగ్గర పడే దాక కలుపుతూ ఉండాలి. తరువాత దించేసి మిశ్రమాన్ని బాగా చల్లార నివ్వాలి.

చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ లో వేసి బాగా పేస్టు లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్టుకి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కలపాలి. ఇంకా ఎండుకారం, ఉప్పు మరియు ఇంగువ నూనె కూడా కలుపుకోవాలి.
అంతే టమాటా పచ్చడి రెడీ......